వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృతి చెందడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ప్రిగోజిన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రిగోజిన్ తన జీవితంలో ఎన్నో తప్పులు చేసినా.. ఎంతో ప్రతిభ గల వ్యక్తి అని తెలిపారు. విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు పుతిన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘‘జీవితంలో ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు చూసిన వ్యక్తి ప్రిగోజిన్. ఇప్పటి వరకు అతడు ఎన్నో తీవ్రమైన తప్పులు చేశాడు కానీ అనుకున్న ఫలితాలు సాధించాడు.’’ అని పుతిన్ పేర్కొన్నారు. ఈ ఘటన జరగడానికి ఒకరోజు ముందే ప్రిగోజిన్ ఆఫ్రికా నుంచి రష్యాకు చేరుకున్నాడని, అధికారులతో కూడా సమావేశమయ్యాడన్నారు. విమాన ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఒక నిర్ధారణకు వస్తామన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని పుతిన్ తెలిపారు. ఈ ప్రమాదం విషాదకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.