రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామి తన ప్రసంగాలతో ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు ఇటీవల బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓటర్ నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా ఓ వ్యక్తి వివేక్‌ను చంపేస్తానంటూ సందేశం పంపాడు.
అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ ప్రచారంలో భాగంగా రాబోయే ఈవెంట్ల సమాచారం గురించి ఓటర్లకు నోటిఫికేషన్లను పంపించగా ఓ వ్యక్తి వివేక్‌ను చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్ పంపాడు. ఆ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ చంపుతానంటూ సందేశంలో పేర్కొన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ సందేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఫోకస్ పెట్టారు. న్యూహాంప్‌షైర్‌లోని డోవర్ నుంచి టైలర్ ఆండర్సన్(30) అనే వ్యక్తి ఈ బెదిరింపు సందేశాలు పంపినట్లు గుర్తించి అరెస్టు చేశారు. తనకు బెదిరింపులు రావడంపై రామస్వామి స్పందిస్తూ.. వేగంగా స్పందించి నిందితుడిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థలకు, తనను రక్షించిన బృందాలకు కృతజ్ఞత తెలిపారు.