ఉక్రెయిన్పై రష్యా భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్పై ఒక్క రోజులోనే 99 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది రష్యా. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేసినా.. వీటిని ఉక్రెయిన్ సైన్యం దీటుగా ఎదుర్కొంటోంది. అయినా పలు చోట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. గగనతల దాడులతో తమ విద్యుత్ సరఫరా వ్యవస్థల్లో తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొంది. దేశంలో అనేక ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయని, మరికొన్ని ప్రాంతాలకు కరెంట్ కోత ముప్పు ఉందని తెలిపింది.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటికే పలు నగరాలను నేలమట్టం చేసిన పుతిన్ సేనలు.. కొన్నిరోజులుగా వైమానిక దాడులను తగ్గించాయి. కానీ రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ పాల్పడుతున్న దాడులకు ప్రతిస్పందనగా తాజాగా మరోసారి ఎదురు దాడులను పెంచాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాల్పడటంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.