ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒకటైన హ్యారీపోటర్ క్యాసెల్పై రష్యా క్షిపణి దాడి చేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనాన్ని ధ్వంసం చేసింది. ఇస్కందర్ క్షిపణికి క్లస్టర్ వార్‌హెడ్‌ను అమర్చి మాస్కో ఈ మిస్సైల్ ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అనుమానిస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
ఈ మిస్సైల్ పడిన చోటు నుంచి 1.5 కిలోమీటర్ల వరకు శకలాలు పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో 20 భవనాల వరకు దెబ్బతిన్నాయి. దాడికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ విడుదల చేశారు. మరోవైపు ఖర్కీవ్ నగరంలోని ఓ రైల్వే లైన్‌పై రష్యా గైడెడ్ బాంబ్‌తో దాడి చేయగా ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఇంకోవైపు ఉక్రెయిన్‌లోని కీలక చసివ్ యార్ నగరాన్ని రష్యా హస్తగతం చేసుకున్నట్లు సమాచారం.