రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు చొచ్చుకుపోతున్న వేళ మాస్కో తిరుగుబాటు మొదలుపెట్టింది. ప్రతీకార చర్యలు తీవ్రం చేసిన రష్యా తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్క్స్ నగరానికి తమ బలగాలను పంపింది. డొనెట్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు మాస్కో వ్యూహాత్మంగా కదులుతోంది. దీంతో పోక్రోవ్స్క్ నగరాన్ని అక్కడి ప్రజలు ఖాళీ చేస్తున్నారు.
దాదాపు 53 వేల మంది పోక్రోవ్స్క్‌లో నివసిస్తున్నారు. సొంత ప్రాంతాన్ని వీడేటపుడు కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉక్రెయిన్ బలమైన రక్షణాత్మక స్థావరాల్లో పోక్రోవ్స్క్ ఒకటి. డొనెట్స్క్ ప్రాంతంలో కీలకమైన రవాణా కేంద్రమైన పోక్రోవ్స్క్ ను స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ రక్షణ సామర్ధ్యం తగ్గుతుందని రష్యా భావిస్తోంది. తద్వారా మొత్తం డొనెట్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ వేస్తోంది. మరోవైపు రష్యాలోని కస్క్ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లిన ఉక్రెయిన్ సైన్యం అక్కడే తిష్ఠవేయాలని చూస్తోంది. అందుకే నదులపై ఉన్న వంతెలను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసి రష్యా సైన్యానికి సరఫరా వ్యవస్థల్ని అడ్డుకోవడం, తమ సైనిక దళాలు అక్కడే తిష్ఠవేసేలా చూసేందుకు యత్నిస్తోంది.