బ్రిటన్ దేశం పెద్ద ఎత్తున అక్రమ వలసలతో సతమతమవుతోంది. ఈ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన వివాదాస్పద ‘రువాండా బిల్లు’కు యూకే పార్లమెంటు ఆమోదం తెలిపింది. అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదని ప్రధానమంత్రి రిషి సునాక్ అన్నారు. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదో మైలురాయని తెలిపారు. బ్రిటన్ రాజు చార్లెస్ III ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది.
బ్రిటన్‌కు వచ్చే అక్రమ వలసదారులను నిరోధించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టామని రిషి సునాక్ తెలిపారు. దీంతో వలసదారులను దోపిడీకి గురిచేసే క్రిమినల్ గ్యాంగ్‌ల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనుంచి దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారు ఇక్కడ ఉండేందుకు తాజా చట్టం అంగీకరించదని స్పష్టం చేశారు.
అసలు ఈ బిల్లు ఏంటంటే..?
బ్రిటన్‌లోకి అక్రమ వలసలు పెరుగుతున్న రువాండా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే యూకేలో అక్రమంగా వచ్చేవారిని 6,400 కి.మీ. దూరంలో రువాండాకు తరలిస్తారు. రాజధాని కిగాలిలో ఏర్పాటుచేసిన శరణార్థి శిబిరాల్లో ఉంచుతారు. ఇందుకోసం ఏప్రిల్ 2022లోనే బ్రిటన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వలసదారులకు మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ఆ దేశానికి ఇప్పటివరకు 290 మిలియన్ల పౌండ్లను చెల్లించింది.