బంగ్లాదేశ్లో అల్లర్లు తీవ్రరూపం దాల్చిన వేళ ఆ దేశ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి బంగ్లాను వీడిన విషయం తెలిసిందే. ఆమె అక్కడి నుంచి నేరుగా భారత్కు వచ్చారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఆమెతో పాటు ఆమె సహాయకులు, అధికారులు హసీనా వెంట వచ్చారు. అయితే వారిలో చాలా మంది కట్టుబట్టలతో దేశాన్ని వీడినట్లు తెలిసింది.
ఆందోళనకారులు అధికారిక నివాసం దిశగా దూసుకొస్తుండటంతో ప్రధాని సహా ఆమె సహాయకులు దేశాన్ని వీడి వచ్చినట్లు సమాచారం. ఆందోళనకారుల నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు వెంటనే అక్కడి నుంచి పారిపోవడంతో కనీసం దుస్తుల వంటి వ్యక్తిగత వస్తువులు కూడా వెంట తెచ్చుకునే పరిస్థితి లేదని వారు వాపోయినట్లు భారత అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రాణాలతో బయటపడటం ముఖ్యమని భావించిన వారంతా ప్రధానితో కలిసి సీ-130 జే విమానంలో భారత్‌కు వచ్చేశారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత భారత్‌లోని ప్రొటోకాల్ ఆఫీసర్లు నిత్యావసర వస్తువుల కొనుగోలులో వారికి సాయం చేసినట్లు సమాచారం.