అమెరికా అధ్యక్ష పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీయే పట్టుబడుతోంది. మరోవైపు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌పై దాడి తర్వాత రిపబ్లికన్ పార్టీ నేతలు ఎన్నడూ లేనివిధంగా ఏకమయ్యారు. గతంలో ట్రంప్‌ను విమర్శించినవారు కూడా ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్నారు. ఇదంతా చూ స్తుంటే ట్రంప్ విజయం ఖాయమైనట్లే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తాజాగా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసీ గబ్బర్డ్ రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌కు మద్దతుగా నిలుస్తూ.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవల కమలాహ్యారిస్ ఓ సభలో మాట్లాడుతూ.. జేడీ వాన్స్ స్వార్థపరుడని… ఆయన రాజకీయంగా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడలేదని పేర్కొన్నారు. దీనిపై తులసీ స్పందిస్తూ.. ‘‘జేడీ వాన్స్ మెరైన్ కోర్‌లో పనిచేసి 2005 ఇరాక్ యుద్ధంలో పాల్గొన్నారు. మరి కమలాహ్యారిస్ గతంలో ఏనాడైనా దేశం కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టారా..?’’ అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.