గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ల మధ్య భీకర పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ను సమూలంగా నాశనం చేయాలనే లక్ష్యంతో గాజాపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఓవైపు నేలపై దాడులు చేస్తూనే మరోవైపు వైమానిక దాడులకు తెగబడుతోంది. గాజాను అష్టదిగ్బంధనం చేసి హమాస్ మిలిటెంట్లను హతమార్చే ప్రయత్నంలో సామాన్య పౌరులనూ పొట్టనబెట్టుకోంది.
ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన 5 నెలల తర్వాత తొలిసారి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్పందించింది. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య తక్షణం కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని, గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సమయంలో బందీలుగా తీసుకెళ్లిన వారందర్నీ హమాస్ విడిచి పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు 15 సభ్యదేశాలున్న భద్రతామండలి సోమవారం ఓ తీర్మానం ఆమోదించింది. దీనికి 14దేశాలు అనుకూలంగా ఓటువేయగా మొదట్నుంచి ఇజ్రాయెల్ అండగా ఉన్న అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉంది.