అమెరికా డ్రోన్‌లు సిరియాలో ఒక ఆపరేషన్‌లో ఉండగా రష్యా ఫైటర్ జెట్లు వాటిని వెంటాడాయని అమెరికా వాయుసేన తెలిపింది. తమ డ్రోన్ల సమీపం నుంచి ప్రమాదకరంగా వెళ్లడంతోపాటు పారాచుట్‌లలో మంటలు రాజేసి ఎంక్యూ-9 రీపర్ల పనితీరు సామర్థ్యం దెబ్బతినేలా చేశాయని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేసింది.
ఈ వీడియోలో రష్యా ఎస్‌యూ-34 ఫైటర్ జెట్లు రీపర్లకు దగ్గరగా వెళ్లడం కనిపించింది. సిరియాలో తమ మూడు డ్రోన్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు సంబంధించి ఓ రహస్య ఆపరేషన్ చేస్తుండగా మూడు రష్యా విమానాలు అదేపనిగా వాటిని వెంటాడాయని పశ్చిమాసియా 9వ వాయుసేన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్స్ గ్రెన్‌కెవిచ్ తెలిపారు. ఓ రష్యా పైలట్ నిర్వాకం వల్ల వచ్చిన మంటలతో తమ రీపర్ పనితీరు దెబ్బతిందని పేర్కొన్నారు. సిరియాలోని రష్యా బలగాలు ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తనను మానుకుంటేనే ఐసిస్‌ను ఓడించడంపై దృష్టి సారించగలమని చెప్పారు.