డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసును సమూలంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు హోరాహోరీగా జరుగుతున్న అధ్యక్ష రేసును ఈ ఘటన ఏకపక్షంగా మారుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ హత్యాయత్నం విషాదకర ఘటనే అయినా.. ఆ సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు ఆయన్ను అమెరికా ప్రజల దృష్టిలో హీరోగా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి.
తూటా తాకిన వెంటనే కిందకు వంగి.. తర్వాత పిడికిలి బిగించి బలంగా పైకి లేచిన తీరు.. ఈ మాజీ అధ్యక్షుడికి రాజకీయంగా రానున్న రోజుల్లో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైగా ప్రచారం విషయంలో ట్రంప్‌ది ఎప్పడూ దూకుడు వైఖరే. ‘అమెరికాకు కావాల్సింది ఇలాంటి యోధుడే’ అంటూ అప్పుడే రిపబ్లికన్లు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ షురూ చేశారు. మరోవైపు ఒపీనియన్ పోల్స్ కూడా ఒక్కసారిగా మాజీ అధ్యక్షుడి అవకాశాలను ఆకాశానికెత్తేస్తున్నాయి.
వాస్తవానికి అధ్యక్ష రేసు ప్రారంభంలో ట్రంప్, బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుందని.. అందుకు తగ్గట్టే ఒపీనియన్ పోల్స్ అంచనాలూ వెలువడుతూ వచ్చాయి. శుక్రవారం ఏబీసీ/వాషింగ్టన్‌పోస్ట్ విడుదల చేసిన సర్వే నివేదిక కూడా ట్రంప్‌నకు అనుకూలంగానే వచ్చింది. ఇక ఆదివారం ఘటనతో ఒక్కసారిగా అమెరికా అధ్యక్ష పోరు ఏకపక్షంగా మారినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.