లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దక్కిన ఫలితాలపై తాజాగా ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గెలుపుపై అతి విశ్వాసం పెట్టుకోవడం కాషాయ పార్టీ ఆశలను దెబ్బ తీసిందని అన్నారు. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే పొందగలిగిందని.. లక్నోలో ఆదివారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ సమర్థవంతంగా పని చేసింది. 2014 నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల (కేంద్ర, రాష్ట్రాల్లో జరిగిన ఆయా ఎన్నికలు) వరకు ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొన్నాం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, అదే ఓట్ల శాతంతో 2024లో మరోసారి విజయం సాధించింది. కానీ ఈ సారి గణనీయమైన మార్పు వచ్చింది. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బీజేపీ పొందినప్పటికీ విపక్షాలకు ఓట్ల శాతం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా గెలుపుపై అతి విశ్వాసమే దీనికి కారణమైందనడంలో సందేహం లేదు. అయితే యూపీలో శాంతి భద్రతలను తమ ప్రభుత్వం పరిరక్షిస్తోంది.’ అని యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.