మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు మధ్యధరా ప్రాంతంలో అమెరికా ఒక ఆర్మీ బృందాన్ని మోహరించిన సంగతి తెలిసిందే. రోజువారీ సైనిక శిక్షణలో భాగంగా నవంబర్ 10న గాల్లోకి ఎగిరిన హెలికాప్టర్ సాంకేతిక సమస్య తలెత్తడంతో మధ్యధరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘటనలో అమెరికాకు చెందిన ఐదుగురు సైనికులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన నాలుగైదు రోజుల తర్వాత ఈ విషయాన్ని తాజాగా అమెరికా అధికారులు ధ్రువీకరించారు.
సైనికుల మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. వారి మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అమెరికా ప్రజలు సురక్షితంగా జీవితం గడపటం కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని బైడెన్ అన్నారు. దేశం కోసం వారి జీవితాలను, ప్రాణాలను పణంగా పెడుతున్నారని సైనికుల సేవలను జో బైడెన్ కొనియాడారు.