వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ మృతి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ప్రిగోజిన్ మృతి వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నాడని ఇప్పటికే పలు ప్రపంచ దేశాల నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. అయితే తాజాగా ఆయన మృతిపై మరో ప్రచారం జరుగుతోంది. ప్రిగోజిన్ మరణం వెనుక పుతిన్ సన్నిహితుడు ఉన్నాడంటూ ఓ పాశ్చాత్య మీడియా సంస్థ వెలువరించిన కథనం కలకలం రేపుతోంది. ఈ కథనంలో ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా సైన్యంలో ఉన్నతాధికారుల వైఖరిపై ధ్వజమెత్తినందుకే ఆయన ప్రాణాలు కోల్పోయాడని పేర్కొనడం గమనార్హం.
ప్రిగోజిన్ హత్యకు.. పుతిన్ సన్నిహితుడైన నికొలాయ్ పత్రుషెవ్ ప్రణాళిక రచించాడని ఆ సంస్థ తన కథనంనలో తెలిపింది. అయితే ఈ కథనంపై స్పందించిన రష్యా అవన్నీ కల్పిత కథనాలని కొట్టిపడేసింది. విమానం రెక్క కింద బాంబు పెట్టి ప్రిగోజిన్ ప్రైవేటు విమానాన్ని కూల్చివేశారని ఆ కథనం పేర్కొనడంపై మండిపడింది. ఈ ఘటనకు రష్యా సెక్యూరిటీ అధికారి నికొలాయ్ పత్రుషెవ్ ప్రణాళిక రచించాడని కథనం పేర్కొంది. ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన తర్వాత.. అతడిని మట్టుపెట్టాలని నికొలాయ్ నిర్ణయించారని, దానికి పుతిన్ అడ్డుచెప్పలేదని కథనం వెల్లడించగా ఇవన్నీ మీడియా కల్పితాలు అంటూ క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఖండించారు.