గతేడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వైపు ఓ యువకుడు ట్రక్కుతో దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన భారత సంతతి కుర్రాడు 20 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా అతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. బైడెన్ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని సాయి హర్షిత్ చెప్పినట్లు అటార్నీ తెలిపింది. ఈ కేసులో అతడికి ఆగస్టు 23న శిక్ష ఖరారు చేయనున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు వెల్లడించింది.
2023 మే 22వ తేదీన సాయి వర్షిత్ అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్ వద్ద బీభత్సం సృష్టించాడు. వైట్ హౌజ్లోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని నిందితుడు విచారణలో అంగీకరించాడు. అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్, ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలిపాడు. ఉద్దేశపూరితంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో రుజువైందని యూఎస్ అటార్నీ తెలిపింది.