రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రపంచం చంపాలనుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై యుద్ధం కారణంగా రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. స్పెయిన్ ప్రధాని కీవ్ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ స్పానిష్ పత్రికలతో మాట్లాడారు.
‘‘ మాపై రష్యా చేస్తున్న యుద్ధంలో ఆ దేశ కిరాయి సైన్యం భారీగా నష్టపోయింది. మా దళాలు దాదాపు తూర్పు ఉక్రెయిన్‌లోనే 21,000 మంది వాగ్నర్ సైనికులను హతమార్చాయి. మరో 80,000 మంది ఆ గ్రూప్ సైనికులు గాయపడ్డారు. వాగ్నర్ పీఎంసీ భారీగా నష్టపోయింది. రష్యా సైన్యం ప్రేరేపిత మూకగా మేము వారిని చూస్తాం. వారంతా ఖైదీలు.. వారి వద్ద కోల్పోవడానికి ఏమీ లేదు’’ అని జెలెన్‌స్కీ తెలిపారు.
ఈ సందర్భంగా ఓ విలేకరి మీకు ప్రాణభయం లేదా..? అని జెలెన్‌స్కీని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రస్తుత పరిస్థితి నాకంటే పుతిన్‌కే ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. కేవలం రష్యాలో మాత్రమే నన్ను చంపాలనుకుంటున్నారు. కానీ, ప్రపంచం మొత్తం పుతిన్‌ను చంపాలనుకుంటోంది’’ అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.