ఆడవాళ్లది హ్యాండ్ బ్యాగులది విడదీయరాని సంబంధం. కనీసం అరడజను బ్యాగులన్నా వారి వద్ద ఉండాల్సిందే. ఇక మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తే దాన్ని కొనాల్సిందే. అయితే ఈ బ్యాగుల్లో వివిధ రకాలుంటాయి. కొందరికి పెద్దగా ఉన్న బ్యాగ్స్ నచ్చితే మరికొందరు మినీ పర్సలకు జై కొడతారు. ఇక క్లాత్, లెదర్ ఇలా రకరకాల మెటీరియల్తో తయారయ్యే హ్యాండ్ బ్యాగుల గురించి అందరికీ తెలిసిందే.
అయితే ఓ కంపెనీ అయితే ఏకంగా గాలితో ప్రపంచంలోనే అత్యంత తేలికైన బ్యాగును తయారు చేసింది. ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని 37 గ్రాముల బరువున్న హ్యాండ్ బ్యాగును తయారు చేసింది. ఏరోజెల్‌తో దీన్ని రూపొందించింది. ఈ పదార్థంలో 99 శాతం గాలి, ఒక శాతం గాజు ఉంటుంది. ఈ బ్యాగ్ తన బరువు కన్నా 4,000 రెట్లు ఎక్కువ బరువును మోయగలదట. అలాగే 1,200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలదట. దీనిని రూపొందించడానికి కోపర్నికి గ్రీక్ పరిశోధకుడు ఐయోనిస్ మిచెలౌడిస్ సహకరించగా.. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ‘కోపర్ని’ దీన్ని ఆవిష్కరించింది.