అయ్యప్ప స్వామి అనుగ్రహం కోసం భక్తులు కార్తిక మాసంలో, సంక్రాంతి పర్వదినాలలో అయ్యప్ప మాల ధరించి స్వామిని సేవిస్తారు. మండల దీక్ష అయ్యాక మకర జ్యోతి దర్శనం తో దీక్షను విరమిస్తారు. అయితే అయ్యప్ప సన్నిధి కేరళలోనే కాక మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఈ ఆలయాన్ని విశాలమైన మైదానంలో నిర్మించారు. ఇంతకి ఆ ఆలయం ఎక్కడ ఉందో, ఆ క్షేత్ర విశేషాలు ఏమిటో చూద్దాం.
ఆంధ్ర ప్రదేశ్లో ని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నగరానికి 18 కి. మి దూరంలో గల ద్వారపూడి లో ఉంది. ఇది రాజమండ్రి నుండి కేవలం అర్థ గంట లో చేరుకోవచ్చు. ఇక్కడున్న అయ్యప్ప ఆలయం గర్భ గుడి కేరళలోని శబరిమలై తరహాలో అచ్చు గుద్దినట్టు ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళే మార్గం పచ్చని పంట పొలాలతో, తోటలతో కను విందు చేస్తుంది. గుడి ముఖ ద్వారంకు చేరుకోగానే ముందుగా గణపతి ఆలయం, తరువాత ఎదురుగా 30 అడుగుల ఎత్తైన హరి హర[సగభాగం శివుడు, సగభాగం విష్ణువు రూపం]విగ్రహం కనపడుతుంది.
అయ్యప్ప గుడి రెండు అంతస్తుల్లో ఉంటుంది. అయ్యప్ప విగ్రహం పైన ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశ మార్గం నోరు తెరుచుకున్న సింహ ముఖ రూపంలో ఉంటుంది. అయ్యప్పస్వామి మందిరానికి ఎదురుగా భారి ఆంజనేయుని విగ్రహం ఉంటుంది. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. శబరిమలై వెళ్ళలేని భక్తులు కొందరు ఇక్కడ ఇరుముడులు సమర్పించి దీక్ష విరమిస్తారు. ఇంకా ఇక్కడ సాయిబాబా ఆలయం, శివాలయం, వెంకటేశ్వర ఆలయం ఉన్నాయి. శివుడు, వేంకటేశ్వరుడు ఒకే చోట ఉండటం విశేషం.