జియో లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వాటాను రూ.43,574 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. జియో విలువ రూ.4.62 లక్షల కోట్లు. దీనిలో అతిపెద్ద మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఫేస్‌బుక్ నిలబడింది. దీనిపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని స్పందించారు. ఇండియా డిజిటల్ సర్వోదయ లక్ష్యంతో 2016లో జియోను ప్రారంభించామని అన్నారు.
దేశంలోని ప్రతీ ఒక్కరి జీవితంలో నాణ్యత పెంచేలా, భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజంగా నిలిపేలా జియోను తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జియోలోకి ఫేస్‌బుక్‌ను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇది గౌరవప్రదమైనదన్న ఆయన… తద్వారా ప్రతి భారతీయుడు డిజిటల్ రంగంలో మరింత లబ్ధి పొందుతారని ఆశిస్తున్నామని అన్నారు. జియో, ఫేస్‌బుక్ సమాహారం డిజిటల్ ఇండియాకు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.
ఎలాంటి హద్దులు లేకుండా ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్ లక్ష్యాలను చేరుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, దానికి జియో, ఫేస్‌బుక్ బంధం ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. దీనిపై ఫేస్బుక్ సీఈఓ మార్క్ కూడా స్పందించారు. భారత్‌లో జియోతో ఫేస్‌బుక్ జత కట్టిందని అన్నారు. ప్రజలు, వ్యాపారం కోసం జియో, ఫేస్‌బుక్ కలిసి సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయని అన్నారు. కీలక ప్రాజెక్టుల్లో ఈ సంస్థలు కలిసి పనిచేయనున్నాయని వివరించారు.