ఐఫోన్‌11 కొంటున్నారా? ఆగండి.. ఐఫోన్‌12 ఓ అద్భుతం..

-

ఈసారి ఐఫోన్‌ విప్లవాత్మకమైన ఫీచర్లతో, సరికొత్త డిజైన్‌తో రానుంది. ఐఫోన్‌6 నుండి దాదాపు ఒకే డిజైన్‌తో వస్తున్న ఆపిల్‌ ఫోన్లు ఈసారి పూర్తిగా కొత్త అవతారం ఎత్తనున్నాయి.

ఐఫోన్‌… మార్కెట్లోకి ఎన్ని రకాల ఫోన్లు వచ్చినా, దీని క్రేజ్‌ దీనిదే. స్టీవ్‌ జాబ్స్‌ అలోచనల్లోంచి పుట్టి, నేడు ప్రపంచమంతా ఆక్రమించిన ఐఫోన్‌, తన కంపెనీ ‘ఆపిల్‌’ను ప్రపంచంలోనే గొప్ప కంపెనీగా మార్చేసింది. ఆపిల్‌ ఉత్పత్తులన్నీ విభిన్నంగా, ఆకర్షణీయంగా, అద్భుతమైన నాణ్యతతో ఉంటాయి. ఐమ్యాక్‌, మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్‌, ఐఫోన్‌.. ఇలా దేన్ని తీసుకున్నా దేనికదే సాటి. జేబులో ఐఫోన్‌, చేతిలో ఐప్యాడ్‌, బ్యాగులో మ్యాక్‌బుక్‌, డెస్క్‌పై ఐమ్యాక్‌….. ఇది ఆపిల్‌ అభిమానుల స్వప్నం.

2019లో వచ్చిన ఐఫోన్‌ 11 సిరీస్‌ అభిమానులను కొంత నిరాశపరిచిన మాట వాస్తవం. సాంకేతికంగా అభివృద్ధి చూపినప్పటికీ, డిజైన్‌పరంగా పాత పద్ధతే కొనసాగించడం వల్ల కొత్తదనం కనబడలేదు. దాంతో ఊహించినంత ఆదరణ లభించలేదు. అయినప్పటికీ ఐఫోన్‌11 సామర్థ్యం తక్కువేంకాదు, అలాగే అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి.

ఇక కొత్త డిజైన్‌ ఇవ్వాల్సిన అవసరమేర్పడిందని గ్రహించిన టిమ్‌ కుక్‌, ఆపిల్‌ పరిశోధన-అభివృద్ధి విభాగం, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి దాదాపు డిజైన్‌ ఫైనల్‌ చేసిందని లీకుల ద్వారా సమాచారం. అంతేకాకుండా హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ విషయంలో కూడా సంచలనాలు సృష్టించబోతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం, పక్కాగా కన్‌ఫర్మ్‌ అయింది 5జి సౌలభ్యం, వెనుకవైపు నాలుగు కెమెరాలు, సరికొత్త రూపం.

ఇక, సెల్ఫీ కెమెరా తెర మధ్యలో ఉండే ‘పంచ్‌హోల్‌’ డిజైన్‌ కూడా కొత్త ఐఫోన్‌లో ఉందంటున్నారు. ఇది ఇంతకుముందే గెలాక్సీ నోట్‌ 10లో ఉంది. సైజుల విషయానికొస్తే, ఐఫోన్‌ 10 లో ఉన్న 5.8 అంగుళాల సైజును 5.4 ఇంచులకు తగ్గించినట్లుగా, 6.5 ఇంచులు ఉన్న మ్యాక్స్‌ను 6.7కి పెంచినట్లుగా లీకులు స్పష్టం చేస్తున్నాయి. 5.4 అంగుళాలంటే చిన్న ఐఫోన్‌ అన్నమాట. ఆపిల్‌ సృష్టికర్త స్టీవ్‌ జాబ్స్‌ కలల పరిమాణమిది. ఒకేచేత్తో ఫోనంతా ఆపరేట్‌ చేయగలగాలన్నది ఆయన అభిలాష. అందుకే తొలితరం ఐఫోన్లన్నీ చిన్న సైజువే.

కెమెరాలు కూడా 3డి సెన్సింగ్‌ సామర్థ్యంతో, కృత్రిమమేధ సహకారంతో ఎవరికీ సాధ్యంకాని నాణ్యతతో ఉండబోతున్నాయట. వీటితో పాటు, యూఎస్‌బి-సి చార్జింగ్‌ పోర్ట్‌, లౌడ్‌ స్పీకర్లు, బ్లూటూత్‌ మ్యూజిక్‌ షేరింగ్‌ లాంటి కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

కాబట్టి.. ఐఫోన్‌ కొనే విషయంలో ఇప్పుడే తొందరపడకండి. ఇప్పుడున్న ఫోన్‌ పూర్తిగా పాడైతే తప్ప. 2020 ఐఫోన్‌ సంచలనాలు సృష్టించబోతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version