BCCI: ఐపీఎల్ పునఃప్రారంభం అప్పుడే…!

-

భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టడంతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ను మళ్లీ ప్రారంభించేందుకు బీసీసీఐ వేగంగా చర్యలు చేపడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దేశంలో భద్రతా పరిస్థితులు మెరుగుపడటంతో ఐపీఎల్ తిరిగి పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతులు లభిస్తే, మే 15 లేదా 16న సీజన్ కొనసాగనుందని సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం, బీసీసీఐ ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలకు మౌఖికంగా కొన్ని సూచనలు ఇచ్చింది. పంజాబ్ కింగ్స్ మినహా మిగిలిన అన్ని జట్లకు చెందిన ఆటగాళ్లు మే 13వ తేదీలోగా తమ హోం గ్రౌండ్స్‌కి చేరాలని బోర్డు సూచించింది. సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకు తగిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు ఫ్రాంచైజీలకు తెలియజేసింది. విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని కూడా సూచించింది.

ఐపీఎల్ మిగిలిన 12 లీగ్ మ్యాచ్‌లను డబుల్ హెడర్ల విధానంలో వేగంగా పూర్తి చేసి, మే 25 నాటికి సీజన్‌ను ముగించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ మొహాలీ పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంగా ఉండటంతో, ఆ జట్టుకు సంబంధించిన మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు బోర్డు యోచిస్తోంది. తాజా భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఇది అవసరమని భావిస్తోంది. ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుండటంతో, అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. తాజా పరిణామాలతో క్రికెట్ మళ్లీ రంగంలోకి వస్తోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news