ఐపీఎల్‌: ముగిసిన తొలి అర్ధభాగం ..ఏ టీమ్ చాన్స్ ఎలా ఉందంటే…!

-

హోరాహోరీ సమరాలు.. ఉత్కంఠ విజయాలు.. అనూహ్య మలుపులతో ఐపీఎల్‌ 13వ సీజన్‌లో తొలి అర్ధభాగం ముగిసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా హౌజ్‌ఫుల్‌ కాకున్నా.. ఫస్ట్‌ హాఫ్‌ అదిరిపోవడంతో.. సెకండ్‌ హాఫ్‌లో బొమ్మ దద్దరిల్లడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇప్పటి వరకు 24రోజుల్లో 28 మ్యాచ్‌ లు పూర్తవ్వగా ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకెళ్తుంది.పంజాబ్‌ అట్టడుగున ఉంది.


అన్ని విభాగాల్లో హేమాహేమీలతో మంచి జోష్‌లో ఉన్న ముంబై ఐదు విజయాలతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుంటే.. యువ ఆటగాళ్ల అండతో ఢిల్లీ కూడా పది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు మరో రెండు మ్యాచ్‌ల్లో ఇదే జోరు కొనసాగిస్తే.. ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కొట్టేయడం దాదాపు ఖాయమే. కోల్‌కతా, బెంగళూరు కూడా తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు కష్టపడుతున్నాయి. హైదరాబాద్‌, రాజస్థాన్‌ మూడేసి విజయాలతో ముందంజ వేయాలని తహతహలాడుతున్నాయి. మూడుసార్లు చాంపియన్‌ చెన్నై పరిస్థితే కాస్త ఆందోళనగా కనిపిస్తున్నది. బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుదరక.. బౌలింగ్‌లో ప్రభావం చూపలేక ఈ సీజన్‌లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ధోనీ సేన మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిస్తేనే టాప్ 4 లో చాన్స్ ఉంది.

ఎనిమిది జట్లలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ అవకాశాలు మాత్రం సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఒక్క మ్యాచ్‌ నెగ్గిన రాహుల్‌ సేన మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ చేరుతుంది. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో పంజాబ్‌ ఆటగాళ్లే ఉన్నా.. బౌలింగ్‌లో పస లేక ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఇప్పటి వరకు మూడు విజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకున్న హైదరాబాద్‌ ఐదో స్థానంలో ఉంది. మిషెల్‌ మార్ష్‌, భువనేశ్వర్‌ కుమార్‌ గాయపడటంతో కాస్త డీలాపడ్డ సన్‌రైజర్స్‌.. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version