దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ‘మధ్య తరగతి మ్యానిఫెస్టో’ను విడుదల చేసింది. ఈ మ్యానిఫెస్టోలో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం ఏడు కీలక డిమాండ్లను పొందుపర్చారు. మ్యానిఫెస్టో విడుదల చేసిన అనంతరం కేజ్రివాల్ మాట్లాడుతూ.. మన దేశంలోని పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని.. వారి సమస్యలను విస్మరించాయని అన్నారు.
పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అందుకే మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు
మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఆప్ ఈ మ్యానిఫెస్టోను రూపొందించిందన్నారు. ఢిల్లీలోని వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని కేజీవాల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వాటిని పలువురు ఉచితాలంటూ విమర్శిస్తున్నారని తెలిపారు.
- కేంద్ర బడ్జెట్ లో విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్ ను 2 శఆతం నుంచి 10 శాతానికి పెంచాలి. ప్రైవేటు పాఠశాలలో ఫీజులపై ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నత విద్య చదివే వారికి సబ్సీడీలు, స్కాలర్ షిప్ ఇవ్వాలి.
- ఆరోగ్య బడ్జెట్ ను 10 శాతానికి పెంచాలి. ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తేయాలి.
- ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7లక్సల నుంచి 10 లక్షలకు పెంచాలి.
- నిత్యవసర వస్తువులపై GST తొలగించాలి.
- సీనియర్ సిటీజన్స్ కోసం మరింత మెరుగైన పింఛన్ పథకాలు ప్రవేశపెట్టాలి.
- దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సీనియర్ సిటీజన్లకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలి. దేశవ్యాప్తంగా రైల్వే, ప్రయాణాల్లో సీనియర్ సిటీజన్లకు 50 శాతం రాయితీ కల్పించాలి.