గతేడాది క్యాన్సర్ బారి నుంచి కోలుకున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించారు. పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ వల్ల ఇర్ఫాన్ అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇర్ఫాన్ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లండించారు.
’పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ కోకిలాబెన్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పడూ తెలియజేస్తాం. ప్రస్తుతం ఆయన వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. అతని బలం, ధైర్యం ఇప్పటివరకు పోరాడటానికి ఎంతగానో సహాయపడ్డాయి. అలాగే ఇప్పుడు కూడా అతని సంకల్ప శక్తి, శ్రేయాభిలాషుల ప్రార్థనలతో త్వరలోనే కోలుకుంటారు అని తెలిపారు.
మరోవైపు మూడు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. శనివారం రోజున ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం కన్నుమూశారు. ఇర్ఫాన్ ముంబైలో ఉండటం.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు. చివరకు తల్లి అంత్యక్రియలను వీడియో కాన్ఫరెన్స్‌లో చూడాల్సి వచ్చింది. ఇది ఇర్ఫాన్‌ను తీవ్రంగా కలిచివేసిందని ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా, 2018లో ఇర్ఫాన్‌కు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆయన విదేశాల్లో చికిత్స తీసుకున్నారు.