కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి తోడు దేశంలో రోజు రోజుకీ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదు. దీంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అలాంటి నిరుద్యోగులకు గాను నెలకు రూ.3800 వరకు నిరుద్యోగ భృతిని అందిస్తున్నారంటూ ప్రస్తుతం ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశంలోని 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి అన్ ఎంప్లాయ్డ్ అలొవెన్స్ స్కీమ్ కింద నెలకు రూ.3800ను భృతిగా అందజేస్తుందని, ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌ను సందర్శించి లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేయాలని.. ఒక మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ మెసేజ్ నకిలీ అని వెల్లడైంది.
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు నెలనెలా భృతి చెల్లించేందుకు ఎలాంటి స్కీమ్‌ను ప్రవేశపెట్టలేదు. అందువల్ల పైన తెలిపిన మెసేజ్ ఫేక్ అని పీఐబీ ట్వీట్ ద్వారా తెలియజేసింది. కాగా గతంలోనూ ఇలాగే ఒక మెసేజ్ వైరల్ అయింది. ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్ట యోజన కింద నెల నెలా నిరుద్యోగులకు రూ.3500 భృతి చెల్లిస్తారని మెసేజ్ వైరల్ అయింది. కానీ అది కూడా నకిలీ అని తేలింది. ఇక ఇప్పుడు కూడా అచ్చం అలాగే మెసేజ్ వైరల్ అవుతోంది. అయితే దాన్ని నమ్మకూడదని, ఎవరికైనా ఆ మెసేజ్ వస్తే స్పందించకూడదని, అందులో ఉండే లింక్ లను క్లిక్ చేయవద్దని, చేస్తే వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని.. పీఐబీ హెచ్చరించింది.