సొంత లిపిలేని ‘హిందీ’ నుంచి హిందుస్థాన్ వ‌చ్చిందా..? మ‌రి సంస్కృతంలో ‘హిందువు’ ఎటుపోయింది?

-

ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కేబినెట్ లోని మంత్రి సంజ‌య్ నిషాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశ‌వ్యాప్తంగా హిందీ మాట్లాడ‌ని వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ** హిందీని ప్రేమించలేని వారిని విదేశీయులుగా పరిగణిస్తాం. హిందీ మాట్లాడలేని వారు ఈ దేశాన్ని విడిచి పోవాలి. ప్రాంతీయ భాషలను మేము గౌరవిస్తాం. కానీ ఈ దేశం ఒక్కటే. భారత రాజ్యాంగం ఇండియాను హిందుస్థాన్ గా చెబుతోంది. అంటే హిందీ మాట్లాడేవారి దేశం అని’’అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ద‌క్షిణాది ప్రాంతాలు.. ద‌క్షిణాది భాష‌లపై ఉత్త‌రాదివారికి చుల‌క‌న‌.. హిందీ పెత్త‌నం..దేశాన్ని విడిచిపోవాలి.. వంటి విద్వేష పూరిత వ్యాఖ్య‌ల గురించి కాసేపు ప‌క్క‌న పెడుదాం. వాటి గురించి మ‌రో సంద‌ర్భంలో ప్ర‌స్తావించుకుందాం.

ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది.. మంత్రి పేర్కొన్న అతి కీల‌క‌మైన వ్యాఖ్య‌. . భారత రాజ్యాంగం ఇండియాను హిందుస్థాన్ గా చెబుతోంది. అంటే హిందీ మాట్లాడేవారి దేశం అని ఆయ‌న పేర్కొన్నారు. మ‌రి ఆయ‌న వ్యాఖ్య‌ల్లోని నిజ‌మెంత‌…? అబ‌ద్ధ‌మెంత‌?

ప్రాచీన కాలం నుంచి భారతభూమికి రకరకాల పేర్లు ఉన్నాయి. జంబూద్వీపం, భరతఖండం, హిమవర్షం, అజనాభవర్ష్, భారతవర్ష్, ఆర్యవర్ష్, హిందూ, హిందుస్థాన్ అని పిలిచారు. బ్రిటీష్ వారి కాలంలో ఇండియా పేరు వ‌చ్చి చేరింది. హిందూ, హిందుస్థాన్ అన్న‌వి భౌగ‌ళికంగా వ‌చ్చిన‌వే.

మ‌న దేశ చ‌రిత్ర‌లో తొలి నాగ‌రిక‌త.. సింధూ నాగ‌రిక‌త. వీరు గ్రీకుల‌తోనూ వ్యాపార వాణిజ్యాలు చేశారు. ముఖ్యంగా ఇక్క‌డ పండించే పత్తిని గ్రీకుకు ఎగుమ‌తి చేసేవారు. సింధూ న‌దీ తీరంలో పండ‌టంతో పత్తిని గ్రీకులు సిండర్ లేదా సిండాన్ అని పిలిచేవారు. సింధూ నది తీరం వెంట నివసించేవారిని సింధువులుగా పిలిచేవారని చరిత్ర చెబుతోంది. వ్యవహారికంలో సింధువు కాస్త.. హిందువుగా మారిపోయింది.

ప‌ర్షియ‌న్ల‌ రాక‌తో ‘స్థాన్‌’ వచ్చి చేరడంతో హిందుస్థాన్‌ అయింది. మొట్టమొదట భారత్‌ను హిందుస్థాన్‌ అని పిలిచింది కూడా పర్షియన్లే. పర్షియన్‌లో ‘స్థాన్‌’ అంటే ల్యాండ్‌ అని అర్థం. పర్షియన్ల కారణంగానే హిందుస్థాన్‌తోపాటు, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, కజకిస్థాన్‌ దేశాలకు పేర్లు వచ్చాయి.

అంతేగానీ.. హిందీ భాష‌కు, హిందుస్థాన్ కు ఎలాంటి సంబంధం లేద‌ని చ‌రిత్ర‌ను చ‌దివిన ఎవ‌రికైనా బోధ‌ప‌డుతుంది. హిందుస్థాన్ అన్న ప‌దం సంస్కృతం నుంచి వ‌చ్చింది. హిందీ భాషా చ‌రిత్ర 300 ఏళ్ల‌కు మించి ఉండ‌దు. హిందీకి దాని సొంత‌ లిపి కూడా లేదు. దేవనాగరి లిపిని అరువుగా వాడుకుంటుంది. 13-15 శ‌తాబ్దం మ‌ధ్య కాలంలో ఆనాటి ఢిల్లీ ప‌రిస‌ర ప్రాంతాల‌లోనే పురాత‌న హిందీని మాట్లాడేవారు. సుమారు 70 ఏళ్ల క్రితం నేటి హిందీగా తీర్చిదిద్దుకుంది.

ఇక ద‌క్షిణ భార‌త దేశంలో మాట్లాడే భాష‌ల‌న్నీ ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన‌వి. తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, తులు, ఇరువ వంటి భాష‌లు ద్రావిడ భాష‌లు. ఒక్కో భాష చ‌రిత్ర వెయ్యేళ్ల‌కు పైగానే ఉంటుంది. స్వాతంత్ర్యం వ‌చ్చేనాటికి మూడు నాలుగు రాష్ర్టాల‌లో హిందీ ఎక్కువ‌గా మాట్లాడుతుండ‌టం.. హిందీతో రాజ‌స్థానీ, గుజ‌రాతీ వంటి భాష‌ల‌కు ద‌గ్గ‌రి పోలిక‌లు ఉండ‌టంతో ఆ భాష‌ను రాజ్యాంగంలో చేర్చారు. అందుకే దానిని అధికారిక భాష అన్నార త‌ప్ప.. జాతీయ భాష లేదు.

మ‌రి అలాంట‌ప్పుడు యూపీ మంత్రి వాద‌నను ఎవ‌రు అంగీక‌రిస్తారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను అహంకార‌పూరితంగానే భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా.. ద‌క్షిణాదివారు ఈ దేశంలో రెండో శ్రేణి పౌరులు అన్న ధోర‌ణి క‌నిపిస్తోంది. దేశ‌మంతా మా ఉత్త‌రాది వారి ఆధిప‌త్య‌మే ఉండాలి త‌ప్ప‌.. ద‌క్షిణాది ప్రాంతాల ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించాల‌న్న ఆలోచ‌న‌లేక‌పోవ‌డ‌మే విషాదం. భారతదేశంలోని ప్రతి భాషా జనులకు వారి వారి స్వంత సాంస్కృతిక వారసత్వం ఉంది. హిందీ భాషను పెంచి పోషించడం కోసం తమ గుర్తింపును పోగొట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేర‌న్న విష‌యాన్ని ఉత్త‌రాది నాయ‌కులు గుర్తిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news