పరీక్షల సమయంలో పిల్లల ఆరోగ్యం పై ఎంతో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తువు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్షలను పూర్తి చేయగలుగుతారు. చాలా శాతం మంది తల్లితండ్రులు సమయం లేకపోవడం వలన ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలను, జంక్ ఫుడ్ వంటివి ఇస్తూ ఉంటారు. వాటి వలన పరీక్షలపై ప్రభావం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు ఎక్కువ అవుతుంది. దీనివలన మెదడు పనితీరు తగ్గిపోతుంది. కనుక పరీక్షల సమయంలో డీప్ ఫ్రై చేసినటువంటి ఆహారాన్ని అస్సలు ఇవ్వకూడదు.
మైదా పిండితో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో మెదడు పనితీరు పై ప్రభావం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా వైట్ బ్రెడ్, పాస్తా వంటివి పిల్లలకు తరచుగా పెట్టకూడదు. వీటిలో ఉండే రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. సహజంగా పిల్లలు కేకులు, పేస్ట్రీలు, డోనట్స్ వంటి వాటిని ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీటిలో ఉండే పంచదార మెదడు పనితీరు పై ప్రభావం చూపుతుంది మరియు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం పంచదార మాత్రమే కాకుండా వాటితో పాటుగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్లను కూడా అస్సలు ఉపయోగించకూడదు.
ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు కూడా జ్ఞాపక శక్తిని తగ్గేలా చేస్తాయి. కనుక వీటిని అస్సలు ఉపయోగించవద్దు. పరీక్షల సమయంలో శక్తి ఎంతో అవసరమని తల్లిదండ్రులు పిల్లలకు ఎనర్జీ డ్రింకులను ఇస్తూ ఉంటారు. వీటి వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎనర్జీ డ్రింక్స్ లో ఉపయోగించే కెమికల్స్ మెదడు పనితీరును తగ్గిస్తాయి. కనుక వీటిని ఇవ్వకపోవడమే మేలు. చాలా శాతం మంది పరీక్షల సమయంలో మెదడు పనితీరు బాగుండాలని కెఫైన్ ను ఎక్కువగా తీసుకుంటారు. కాకపోతే అధిక శాతం కెఫైన్ ను తీసుకోవడం వలన ఆరోగ్యం పై ఎంతో ప్రభావం ఉంటుంది.