బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసేప్పుడు అప్పటికే ఆ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవాళ్లచేత సంతకం చేయించుకు రమ్మంటారు. అలాంటి సంతాకలు అయితే మనం పెద్దగా ఆలోచించకుండా చేస్తాం.. కానీ లోన్ తీసుకునేప్పుడు కూడా ఇలానే మీ మిత్రుడో, బంధువో ఎవరో ఒకరి చేత సంతకం పెట్టించమని లోన్ ఇచ్చేవాళ్లు అడుగుతారు. అరే ఫ్రెండ్‌గాడు లోన్ తీసుకుంటున్నాడు.. జస్ట్ సైన్ చేస్తే ఏమవుతుందిలే అని ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారంటే.. కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. లోన్ తీసుకునే వ్యక్తి మీకు బాగా సన్నిహితుడు ఆర్థిక ఇబ్బదులు ఏం లేవు అనుకుంటే పర్లేదు.. సంతంక చేయొచ్చు.. కానీ అప్పటికే పీకల్లోతు అప్పులు, చంచలమైన మనస్థత్వం., ఈ మధ్య పరిచయం.. సంతకం చేయను అంటే నొచ్చుకుంటారేమో అని మొహమాటం కొద్ది చేస్తే అంతే..!
హామీ ఎందుకు అడుగుతారు..?
లోన్ తీసుకుంటే కచ్చితంగా హామీ సైన్ అడగురు.. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆర్థిక చరిత్ర సక్రమంగా ఉండదో లేదా క్రెడిట్ స్కోర్ చాలినంత లేదో..ఆ సమయంలోనే బ్యాంకులు హామీ అడుగుతుంటాయి. ఒక్కోసారి వ్యక్తి చేస్తున్న ఉద్యోగం రిస్క్‌తో కూడుకున్నదైనా ఆర్థిక సంస్థలు ఇతరుల హామీని తప్పనిసరి చేస్తాయి. అలాగే సదరు వ్యక్తికి రుణం కట్టే సామర్థ్యం లేదని బ్యాంకులు భావించినా ఎవరినైనా హామీగా తీసుకురావాలని కోరతాయి. హమీదారును బ్యాంకులు ఎప్పుడు అడగాలి అనే విషయంపై స్పష్టమైన నియమ, నిబంధనలేమీ లేవు. అందుకే ఎందుకు హామీదారుడి సంతకాన్ని తీసుకోవాల్సి వస్తుందో ముందే అడిగి తెలుసుకోవడం మీ బాధ్యత.
సంతకం పెడితే ఉండే రిస్కులు ఇవే..!
భారం మీపై పడొచ్చు..
హామీ సంతకం చేసే వ్యక్తి ఆదాయ, ఉద్యోగ వివరాలతో పాటు క్రెడిట్ స్కోర్, రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. తగిన వ్యక్తి అనుకుంటేనే బ్యాంకులు సంతకం చేయడానికి అనుమతిస్తాయి. ఎందుకంటే రుణం తీసుకున్నవారు ఒకవేళ సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోతే.. ఆ మొత్తాన్ని హామీదారు నుంచి వసూలు చేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. జరిమానా, ఇతర అపరాధ రుసుములు కూడా వాళ్లు చెల్లించాల్సిందే.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం..
ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి/వ్యక్తులు సకాలంలో వాయిదా చెల్లించలేకపోతే.. ఆ బాధ్యత హామీదారుపై కూడా ఉంటుంది. అందుకే చెల్లింపుల్లో ఏమాత్రం ఆలస్యమైనా ఆ ప్రభావం హామీ సంతకం చేసే వ్యక్తి క్రెడిట్ స్కోరుపై కూడా ఉంటుంది. ఇక మీకు క్రెడిట్ స్కోర్ అనేది ఎంత ముఖ్యమైన విషయో తెలుసు.. ఒకవేళ భవిష్యత్తులో మీకు ఎప్పుడైనా రుణం తీసుకోవాలంటే ఇబ్బంది తలెత్తొచ్చు. అందుకే మీరు ఎవరికైతే.. హామీ ఇస్తున్నారో వారు తిరిగి చెల్లిస్తున్నారా? లేదా? తరచూ చెక్ చేసుకోండి. అలాగే మీ క్రెడిట్ స్కోరును కూడా పరిశీలించుకుంటూ ఉండండి.
మీరు లోన్ తీసుకోవాలంటే రుణ అర్హత తగ్గొచ్చు..
హామీ సంతకం చేస్తున్నారంటే.. ఆ మొత్తాన్ని చెల్లించడానికి నేనూ సిద్ధమే అని అంగీకరిస్తున్నారని అర్థం. ఈ నేపథ్యంలో ఒకవేళ మీరు రుణం తీసుకోవాలనుకుంటే.. బ్యాంకులు మీరు హామీ ఉన్న మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. దాని ఆధారంగానే ఎంత లోన్ ఇవ్వాలో నిర్ణయిస్తాయి. ఒకవేళ త్వరలో మీరు ఏదైనా లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే.. ఇతరులకు హామీ సంతకం చేయకపోవడమే మంచిది.