టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్‌గా మార్చి..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి కేసీఆర్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణలో సత్తా చాటిన కేసీఆర్..ఇకపై దేశ రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో మొదటగా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో ప్రధానంగా కర్ణాటకలో పోటీపై ఇప్పటికే కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడిఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. జేడిఎస్‌తో పొత్తుతో ముందుకెళ్లనున్నారు. ఇక త్వరలోనే కర్ణాటక పార్టీ ఆఫీసులని ప్రారంభించి..అక్కడ రాష్ట్ర స్థాయి పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అయితే కర్ణాటక బాధ్యతలని ప్రకాష్ రాజ్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది. సరే ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది పక్కన పెడితే..కర్ణాటక రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది.
ఇదిలా ఉండగానే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంపై జగన్ కూడా ఫోకస్ చేశారని ప్రచారం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ఎన్నికల బరిలో దించడంలో భాగంగా ఇప్పటికే జగన్..గాలి జనార్ధన్ రెడ్డితో చర్చలు కూడా జరిపారని కథనాలు వస్తున్నాయి. దీనికి గాలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న స్థానాల్లోనే వైసీపీ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది.
కర్ణాటకలో ఎక్కువగా రాయలసీమ జిల్లాలకు చెందిన వారు ఎక్కువ ఉంటారు. ఎలాగో రాయలసీమలో వైసీపీకి బలం ఎక్కువ. కాబట్టి కర్ణాటకలో వైసీపీకి ఆదరణ వస్తుందని భావిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో క్లారిటీ లేదు. జగన్ కూడా ఎంట్రీ ఇస్తే..కర్ణాటకలో కేసీఆర్, జగన్‌ల మధ్య పోటీ ఉన్నట్లే. కానీ కేసీఆర్ ఫిక్స్ గాని..జగన్ కర్ణాటక రాష్ట్రంలోకి ఎంట్రీపై క్లారిటీ లేదు. అలాగే అక్కడ బీజేపీ-కాంగ్రెస్-జేడిఎస్‌ల మధ్య పోరు జరుగుతుంది..అక్కడ రాజకీయంగా స్పేస్ తక్కువ. ఆ స్పేస్‌లో తెలుగు పార్టీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది అనుమానమే.