హిందూ శాస్రం ప్రకారం పుణ్య తిధులలో, పండుగల టైం లో ఉపవాసం వుంటటం చూస్తుంటాం. ఐతే ఉపవాసం అనేది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, అది మనసును దైవచింతనలో నిలపడం. అయితే ఉపవాసం ఉన్న రోజున గుడిలో ఇచ్చే ప్రసాదం తీసుకోవచ్చా? తీసుకుంటే ఉపవాసం భంగమవుతుందా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. భక్తికి, నియమానికి మధ్య జరిగే ఈ చిన్నపాటి సంఘర్షణ గురించి, అసలు ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో సరళంగా, స్పష్టంగా తెలుసుకుందాం.
ఉపవాసం అంటే: భగవంతుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఈ సమయంలో ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. అయితే, ప్రసాదం అనేది సాక్షాత్తూ ఆ పరమాత్మ మిగిల్చింది. శాస్త్రాల ప్రకారం “నైవేద్యం తీర్థ ప్రసాదానాం భక్షణే నాస్తి పాతకం” అంటే భగవంతుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల ఎలాంటి పాపం చుట్టుకోదు, పైగా అది పుణ్యప్రదం.
ఉపవాస సమయంలో ప్రసాదం లభిస్తే దానిని కళ్ళకు అద్దుకుని కొద్దిగా (గోరంత) స్వీకరించడం వల్ల నియమం తప్పినట్లు కాదు. ప్రసాదాన్ని తిరస్కరించడం అంటే భగవంతుడిని అగౌరవపరచడమే అవుతుంది. కాబట్టి ఆకలి తీర్చుకోవడానికి కాకుండా భక్తితో స్వీకరిస్తే అది అత్యంత శ్రేష్ఠం.

పుణ్యమా లేక పాపమా? : ప్రసాదం స్వీకరించడం ఖచ్చితంగా పుణ్యమే కానీ పాపం కాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రసాదం పేరుతో కడుపు నిండా భోజనం చేయడం లేదా అధికంగా స్వీకరించడం వల్ల ఉపవాస దీక్షకు భంగం కలుగుతుంది. కేవలం ఒక చిన్న ముక్క లేదా తులసి దళం వంటివి స్వీకరించడం వల్ల మనసు శుద్ధి అవుతుంది.
భక్తి భావంతో తీసుకునే ప్రసాదం మీ సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. ఒకవేళ మీరు కఠిన ఉపవాసంలో ఉండి ప్రసాదం తీసుకోవడం ఇష్టం లేకపోతే, దానిని కళ్ళకు అద్దుకుని భద్రపరుచుకుని మరుసటి రోజు ఉపవాసం అయ్యాక తీసుకోవచ్చు. దీనివల్ల నియమం చెడదు, దైవ ప్రసాదాన్ని గౌరవించినట్లూ ఉంటుంది.
ఇక చివరిగా ఏమిటంటే, ఉపవాసం అనేది భౌతికమైన ఆహారం కంటే మానసికమైన నిగ్రహానికి సంబంధించింది. ప్రసాదాన్ని కేవలం ఆహారంగా చూడకుండా దైవప్రసాదంగా భావించి స్వీకరించడం ఉత్తమం. అది మీ ఉపవాసాన్ని పాడు చేయదు, సరి కదా మీలో ఆధ్యాత్మిక శక్తిని నింపుతుంది. భక్తితో చేసే ఏ పనిలోనూ దోషం ఉండదు.
