ఏపీ బీజేపీ ఎదుగుద‌ల‌కు టీడీపీనే అడ్డంకా ?

-

ఏపీలో బీజేపీ ఎదుగుద‌ల‌కు ఉన్న అడ్డంకులు ఏంటి?  విభ‌జ‌న త‌ర్వాత‌.. అనూహ్యంగా నాలుగు స్థానాల్లో అసెంబ్లీకి, రెండు స్థానాల్లో పార్ల‌మెంటుకు విజ‌యం సాధించిన బీజేపీ.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మాత్రం చ‌తికిల ప‌డింది. దీనికి కార‌ణాలు ఏంటి?  పార్టీ పుంజుకోక‌పోవ‌డానికి క‌మ‌ల నాథులు చెబుతున్న కార‌ణాల్లో నిజ‌మెంత‌?  ఇప్పుడు ఈ విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. తెలంగాణ‌లో దుబ్బాక ఉప ఎన్నిక‌లో విజ‌యం త‌ర్వాత‌.. క‌మ‌ల నాథుల క‌న్ను.. ఏపీపైనే ప‌డింది. ఇక్క‌డ త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న తిరుప‌తి ఉప పోరులో విజ‌యం సాధించి స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఈ క్ర‌మంలోనే ఏపీలో బీజేపీ బ‌లాబ‌లాల‌పై నాయ‌కులు దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ వెలుగు చూసింది. ఏపీకి చెందిన బీజేపీ నేత‌లు.. త‌మ ఎదుగుద‌ల‌ను టీడీపీ శాసిస్తోంద‌ని.. త‌మ వారిని టీడీపీలోకి లాగేసుకోవ‌డం, టీడీపీకి అనుకూలంగా మార్చేసుకోవ‌డం కార‌ణంగానే ఏపీలో బీజేపీ బ‌లోపేతం కాలేక పోతోంద‌ని ఒక వాద‌న‌ను వినిపించారు. ఇక‌, మ‌రికొంద‌రు సొంత‌గా బ‌లం లేక‌పోవ‌డంతోనే ఇలా జ‌రుగుతోంద‌ని తెలిపారు. మొత్తంగా చూస్తే.. నిజంగానే టీడీపీ కార‌ణంగా ఏపీబీజేపీ ఎద‌గ‌లేక‌పోతోందా?  లేక .. సంస్తాగ‌త‌మైన కార‌ణాలు ఉన్నాయా? అనే చ‌ర్చ పార్టీలో కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వ‌ర‌కు సాగుతోంది.

దీనిని ప‌రిశీలిస్తే.. ఏపీ నుంచి వెంక‌య్య‌నాయుడు ఎదిగి.. జాతీయ‌స్థాయిలో చ‌క్రం తిప్పారు. అదే స‌మయంలో ఏపీలో బీజేపీకి పునాదులు వేసిన నాయ‌కుల్లో ఆయ‌న కూడా కీల‌క‌పాత్ర పోషించారు. ఆయ‌న‌ను ఆపింది ఎవ‌రైనా ఉన్నారా?  ఒక వేళ కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తున్న నిదుల‌తోనే రాష్ట్రంలో ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాలు చేస్తోంద‌ని భావిస్తున్న రాష్ట్ర బీజేపీ నేత‌లు.. ఆ మేర‌కు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప్ర‌చారం చేసుకుంటే.. రుజువులు చూపిస్తే.. ఎవ‌రైనా వ‌ద్ద‌ని అంటారా?  కాద‌ని అడ్డు చెబుతారా? ఇక‌, సంస్థాగ‌తంగా పార్టీ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఏదైనా ప్ర‌య‌త్నం చేస్తే.. కాద‌ని అనే వారు ఉంటారా?

ఇలాంటి వాటిని ప‌ట్టించుకోని బీజేపీ రాష్ట్ర నాయ‌కులు.. కేవ‌లం టీడీపీ లేదా.. వైసీపీపై ప‌డి ఏడ్చినంత మాత్రాన ఒరిగేది ఏంట‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికైనా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. సంస్థా గ‌తంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తే.. మంచి ద‌ని సూచిస్తున్నారు. మ‌రి క‌మ‌ల నాథులు ఇప్ప‌టికైనా వాస్త‌వాలు తెలుసుకుంటారో .. లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version