సాధారణంగా కొత్త వాహనాలను టెస్ట్ డ్రైవ్ పేరుతో చోరీ చేస్తూ ఉంటారు కొందరు. దీనితో షో రూమ్ యజమానులు వాటి విషయంలో ఈ మధ్య అనేక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓఎల్‌ఎక్స్ లో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన సలామ్‌బిన్ ఆలీ తిమిమ్మి అలియాస్ సలీమ్, పటేల్ నగర్ అంబర్‌పేటకు చెందిన,
మహ్మద్ సోహిల్ ఇద్దరూ సోదరులు. గత కొంత కాలంగా జల్సాలు, వ్యసనాలకు ఇద్దరు బాగా అలవాటు పడ్డారు. దీనితో చోరీల కోసం కాస్త అందరికంటే భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టిన వాహనాలను లక్ష్యంగా చేసుకోవడం మొదలుపెట్టారు. నకిలీ ఫోన్ నంబర్‌లతో అమ్మకానికి పెట్టిన యజమానులకు ఫోన్ చేసి వారిని బండి తీసుకుని పలానా చోటకి రమ్మని చెప్తారు.
అక్కడికి రాగానే బండిని టెస్ట్ డ్రైవ్ పేరుతో తీసుకుని కనపడకుండా పోతారు. ఇలా ఇప్పటి వరకు 5 బైక్ లను వాళ్ళు చోరీ చేసారు. తాజాగా ఇలా బైక్ పోగొట్టుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి ఆట కట్టించారు. ఈ ఇద్దరు దొంగలపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ పీడీయాక్టు నమోదు చేశారు. రాచకొండ కమీషనరేట్ పరిధిలో ఇవి జరుగుతున్నాయని గుర్తించారు.