బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర గవర్నర్ను కలవడానికి సిగ్గుండాలని ఫైర్ అయ్యారు.. అసలు గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ను అనేక విధాలుగా కేసీఆర్ అవమానించారని,అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ఆశ్రయించడం సిగ్గు చేటు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరుగుతుందని బీఆర్ఎస్ నేతలంటున్నారు.. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసింది మీరు కాదా..? అని బీర్ల ఐలయ్య అన్నారు. రాజ్యాంగానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా నియంతృత్వ పాలన చేసింది మీరు కాదా.. తెలంగాణలో రాజ్యాంగాన్ని ఖననం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రాజ్ భవన్ ముందు కేటీఆర్ గొంతు చించుకుంటున్నారని , పది సంవత్సరాలపాటు ఆయన గొంతు ఎందుకు మూగబోయింది.. తెలంగాణలో ప్రతిపక్షాలే లేకుండా కేసీఆర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కేటీఆర్ మౌనవ్రతం పాటించారా..? అని ఆయన ప్రశ్నించారు.