దేశంలోని పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐటీ రిటర్న్స్‌ను ఫైల్ చేసేందుకు గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్‌ను సమర్పించేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు వ్యక్తులకు గడువు పెంచుతున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వెల్లడించింది. ఇంతకు ముందు ఈ గడువు జూలై 31వ తేదీ వరకు ఉండేది.
ఇక కంపెనీలకు అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువును నవంబర్ 30వ తేదీ వరకు పెంచుతున్నట్లు తెలిపింది. కాగా పన్ను చెల్లించే కంపెనీలకు ఆడిట్ గడువును అక్టోబర్ 31వ తేదీగా నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు, సంస్థలు ఇబ్బందులు పడకూడదనే విషయంతోనే ఆయా గడువులను పొడిగించినట్లు సీబీడీటీ తెలిపింది. ఈ క్రమంలో దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఊరట కలుగుతుందని పేర్కొంది.
ఇక కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఫాం 16ను ఇచ్చేందుకు జూలై 15వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. కాగా దేశంలో పన్ను చెల్లింపు దారులు కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ సదుపాయం లభిస్తుంది. దేశంలో రూ.2.50 లక్షలు, అంతకు లోపు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్నవారు 5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల ఆదాయం ఉన్నవారు 10 శాతం, రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 20 శాతం, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 25 శాతం, రూ.15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం పొందే వారు 30 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.