జనసేనకు కొత్త ఊపొచ్చింది. బీజేపీ తానులో ముక్కగా.. టీడీపీ చంకనెక్కిన బిడ్డగా బ్రతకవద్దని జనసేనానికి ఆ పార్టీ కార్యకర్తలు గట్టిగా నొక్కిమరీ చెప్పారు. ఇకనైనా సీరియస్ గా రాజకీయాలు చేయాలని, వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని, రియల్ లైఫ్ లో కూడా హీరోగా మారాలని.. తాను నమ్మిన తనను నమ్మిన జనాలకోసం నిక్కచ్చిగా నిలబడాలని పరోక్షంగా తమ ఓట్లతో సూచించారు.
అవును… ఇంత కాలం నిరాశనిస్పృహలతో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆ పార్టీ కార్యకర్తలు బూస్ట్ ఇచ్చారు. “తమపని తాము సక్రమంగానే చేస్తున్నాం.. చేశాం.. ఇక మీ వంతు.. ” అంటూ తాజాగా వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలతో చెప్పకనే చెప్పారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 5.53శాతం ఓట్లకు మాత్రమే పరిమితమైన పార్టీకి పరిషత్ ఎన్నికల్లో 25.2శాతం ఓట్లు రప్పించారు.
అవును… పరిషత్ ఎన్నికల్లో జనసేన 1200 స్థానాల్లో పోటీ చేసి 177 స్థానాల్లో గెలుపొందింది. సీట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… పెరిగిన ఓట్ల శాతం మాత్రం చాలా ఎక్కువ. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో జనసేనకు ఇది చిన్న విషయం కాదు. బీజేపీని నమ్ముకోకుండా – టీడీపీ చంకనెక్కకుండా నికార్సుగా నిలబడి రాజకీయం చేస్తే… ఈస్థాయి మార్పు పక్కా అని నిరూపించారు జనసైనికులు.
ఈ సమయంలో జనసేనాని చేయాల్సింది ఒకటే… కార్యకర్తల ఉత్సాహానికి తగిన ప్రోత్సాహం అందించడం. వారి అన్ని విషయాల్లోనూ అడుగడుగా అండగా తోడుగా ఉండటం చేయాలి. అవును… పవన్ ఇకపై క్షేత్రస్థాయిలో పర్యటించాలి. కార్యకర్తలను కలుపుకుపోవాలి. కార్యకర్తలు చేయాల్సిందంతా చేశారు.. ఇక తన వంతు అని పవన్ గ్రహించాలి. అలాకాకుండా… మిగిలిన రాజకీయం కూడా కార్యకర్తలే చేస్తారని – తాను మాత్రం సినిమాలు చేస్తూ – ప్రెస్ మీట్ లు మాత్రమే పెడతానంటే కుదరదని గ్రహించాలి!