‘జబర్దస్త్’ రాజకీయం..వైసీపీ వేడుకల్లో హైపర్ ఆది.!

-

ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. మరోవైపు జనసేన సైతం వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తుంది. పవన్ కల్యాణ్ ఏ మాత్రం జగన్ వైసీపీని వదిలిపెట్టడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పొత్తు పెట్టుకునైనా సరే వైసీపీని ఓడించాలని చూస్తున్నారు. అయితే ఇలా ఏపీలో రాజకీయం నడుస్తుంటే..ఈ రాజకీయాలు సినీ ఇండస్ట్రీలో కూడా నడుస్తున్నాయి. ఇండస్ట్రీలో కూడా వైసీపీ-టీడీపీ-జనసేన అంటూ వర్గాలు చీలిపోయి ఉన్నాయి.

 

ఇక సినీ ఇండస్ట్రీకు సంబంధించిన రోజా మంత్రిగా ఉన్నారు. అటు ఆలీ, పోసాని కృష్ణమురళి లాంటి వారికి జగన్ ప్రభుత్వంలో కీలక పదవులు దక్కాయి. అయితే జబర్దస్త్‌లో హైపర్ ఆది..పవన్ కల్యాణ్ ఫ్యాన్ అనే సంగతి తెలిసిందే. ఆయన జనసేన కోసం కూడా గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఆయన జనసేనలోనే ఉన్నారు. ఇలా పవన్ ఫ్యాన్‌గా ఉన్న హైపర్ ఆది తాజాగా జగన్ పుట్టిన రోజు వేడుకల్లో కనిపించారు. డిసెంబర్ 21న జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ ప్రభుత్వం..జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు వేడుకగా నిర్వహిస్తున్నారు.

ఇదే క్రమంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా ఈ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి రోజాతో పాటూ పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ, యాంకర్ అనసూయ, హైపర్ ఆదితో పాటు జబర్దస్త్ నటులు కూడా సందడి చేశారు.

అయితే ఇందులో హైపర్ ఆదిని వైసీపీ శ్రేణులు హైలైట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పవన్ ఫ్యాన్ కాబట్టి. దీంతో ఆయన జనసేన అయితే..వైసీపీ వాళ్ళు ఎందుకు ఆహ్వానించారని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కానీ ఆది ఆ వేడుకలకు వెళ్ళిన జగన్‌పై పొగడ్తలు జల్లు కురిపించలేదు. కేవలం మంత్రి రోజా ఆహ్వానించడంతో ఈ కార్యక్రమానికి వచ్చామన్నారు. రోజా కూడా జబర్దస్‌లో తమను ఎంతో ప్రొత్సహించారని.. చాలా రోజుల తర్వాత మంత్రి సమక్షంలో కార్యక్రమం చేశామని ఆది చెప్పుకొచ్చారు. అంటే రోజాతో ఉన్న పరిచయం వల్లే ఆది వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తానికి జబర్దస్త్ నటులని తీసుకొచ్చి జనాలని ఆకర్షించడం కోసం రోజా బాగానే ట్రై చేశారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version