కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం వైయస్‌జగన్ భేటీ సుదీర్ఘంగా సాగింది. రాష్ట్రానికి సంబధించిన పలు అంశాలపై చర్చ జరగగా పోలవరం అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించి వినతిపత్రం అందించినట్టు చెబుతున్నారు. రెండవ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ (2వ ఆర్‌సీఈ) ప్రకారం 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టుకోసం అయ్యే రూ, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేసారు. ఈమేరకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోరిన సీఎం 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్ చేయాలని కోరినట్టు సమాచారం.
2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందని, అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల ఆర్ అండ్ ఆర్‌కోసం పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిందన్న సీఎం పోలవరం నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1779 కోట్ల రూపాయలను రియింబర్స్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెకై్టన పోలవరాన్ని సత్వరం పూర్తిచేయడానికి తగిన విధంగా సహాయం అందించాలని సీఎం కోరారు.