ఆంధ్రప్రదేశ్ లో గత వారం నుంచి స్కూల్స్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే..విద్యార్థులంతా బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే జగనన్న విద్యాకానుక పేరిట పుస్తకాలతో పాటు యూనిఫాం, బ్యాగ్స్, షూ, ఇతర వస్తువులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తికానుంది.
ఇక ప్రైవేట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులు వేలకు వేలు ఫీజులు చెల్లించడంతో పాటు పుస్తకాలపైనా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పుస్తకాల పేరుతో వేలకువేలు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి దొపిడీకి అడ్డుకట్ట వేసేందుకు జగన్ ప్రభుత్వం కొత్త నిభంధనలను అమలు చేయనుంది..
విద్యార్థుల తల్లిదండ్రులపై భారం పడకుండా ప్రభుత్వమే పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసే విధానాన్ని ప్రారంభించింది. గుర్తింపుపొందిన విద్యాసంస్థలకు పాఠ్యపుస్తకాలతో పాటు వర్క్ బుక్స్ ను ప్రభుత్వం అందిస్తోంది. దీంతో కొంత భారం తగ్గనుంది.రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 24 లక్షల 44వేల మందికి పైగా విద్యార్థులుండగా.. 18లక్షల మంది విద్యార్థులకు సరిపడా ఇండెంట్ ప్రభుత్వానికి వచ్చింది. వీరికి ఆయా తరగతుల అవసరాన్ని బట్టి మొత్తం 1.83 కోట్ల పుస్తకాలను విద్యాశాఖ సిద్ధం చేసింది.
ఈ మేరకు యాజమాన్యాలు నిర్దేశిత గేట్‌వే ద్వారా డబ్బులు చెల్లించగానే పుస్తకాలను ఎంఈవోల ద్వారా పంపిణీ చేస్తారు. ఈ మేరకు పుస్తకాల ధరలను నిర్ణయిస్తూ శనివారం విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల ప్రకారం ఇంగ్లీష్ మీడియంకు 1వ తరగతికి రూ.280, రెండవ తరగతికి రూ.298, 3వ తరగతికి రూ.443, 4వ తరగతికి రూ.466, 5వ తరగతికి రూ.479, 6వ తరగతికి రూ.326, 7వ తరగతికి రూ.414, 8వ తరగతికి రూ.527, 9వ తరగతికి రూ.555, 10వ తరగతికి రూ.674గా నిర్ణయించింది.తెలుగు మీడియం అయితే..1వ తరగతికి రూ.326, 2వ తరగతికి రూ.348, 3వ తరగతికి రూ.553, 4వ తరగతికి రూ.578, 6వ తరగతికి రూ.597, 6వ తరగతికి రూ.484, 7వ తరగతికి రూ.638, 8వ తరగతికి రూ.655, 9వ తరగతికి రూ.557, 10వ తరగతికి రూ.657గా నిర్ణయించింది.. ఈ ధరల తగ్గింపు వల్ల పిల్లల ఫీజుల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.