ఏపీ రాజకీయాల్లో ఎలక్షన్ వేడి నేటి నుంచి మరింత పెరిగింది. జాతీయ రాజకీయాల్లో నాన్ కాంగ్రెస్ – నాన్ భాజపా కూటిమి ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్న తెరాస అధినేత కేసీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫెడరల్ ఫ్రెంట్ కి మద్దతు కోరుతూ బుధవారం (జనవరి – 16న) తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ ని లోటస్ పాండ్ కి పంపారు. అయితే దాదాపు గంట పాటు సాగిన సమావేశంలో కేసీఆర్ కూటమి గురించి ఆవశ్యకత గురించి చర్చించుకుని.. అంతిమంగా వారికి మద్దతు ఇచ్చే దిశగా జగన్ మీడియాకు వెల్లడించారు…వీరిద్దరి కలయికతో ఒక్క సారిగా ఉలిక్కిపడ్డ ఏపీ తెదేపా నేతలు మీడియా ముందు హడావుడి చేస్తూ ప్రసంగించడం ఎంతో విడ్డూరంగా ఉంది.
జగన్ కి కలిసొచ్చే అంశాలు…
రాష్ట్ర విభజన నాటి నుంచి ప్రత్యేక హోదా సాధనపై పోరాటం సాగించడం.
హోదా సాధనలో తెదేపా విఫలం అయినప్పటి నుంచి కేంద్రంలో ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇస్తుందో వారికే తమ సంపూర్ణ మద్దతు అంటూ.. మాటపై నిలబడటం.
ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొచ్చేలా వ్యవహరిస్తేనే ఫెడరల్ ఫ్రెంట్ కు మద్దతిస్తానని ముక్కు సూటిగా కేవలం చర్చల్లోనే కాకుండా.. మీడియా ముఖంగా జగన్ వివరించడం.
తెలంగాణలో మధ్యంతర ఎన్నికల్లో జగన్ అనుసరించిన న్యూట్రల్ విధానంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో వచ్చిన ఆలోచన దోరణిలో మార్పు.
అవసరమైతే ఉన్నఫలంగా ఇప్పటికిప్పుడు ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రానికి లేఖ రాయడానికి తను సిద్ధమని కేసీఆర్ తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పడంతో ..వైసీపీ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతించారు.
ఏపీలో 25 మంది ఎంపీలతో ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మన ఎంపీలకు తోడు తెలంగాణ ఎంపీలు ఉన్నట్లైతే కేంద్రం పై మరింత ఒత్తిడిని పెంచవచ్చు అనే భావన. ఇలా దాదాపు నాలుగున్నరేళ్లుగా ఏపీ విషయంలో మాట మీద నిలబడటంతో పాటు ఏపీలో ప్రభుత్వ మార్పుని కోరుకోవడం అనేది లాభించే విధంగా ఉంది.
అన్నింటికంటే ముఖ్యంగా తెరాస ప్రభుత్వానికి ఆంధ్రాప్రాంతానికి చెందిన ఓటర్లు బ్రహ్మరథం పట్టడం వంటి అంశాలు రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారంగా పేర్కొనవచ్చు.
ఇదిలా ఉంటే ఆలు లేదు సూలు లేదు….. అన్నట్లు తెదేపా, జనసేన నేతలకి అప్పుడే చెమటలు పట్టడం చూస్తుంటే జనంలో జగన్ కి ఉన్న ఫాలోయింగ్, పాలనలో కేసీఆర్ కి ఉన్న దార్శనికత భవిష్యత్ తరాలకు భరోసాను కల్పించేలా ఉన్నాయి.