శాసన మండలిలో రాజధాని బిల్లు, సిఆర్దియే బిల్లులు ఆగిపోయినా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు వెనక్కు తగ్గే అవకాశం లేదా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మండలిలో నాటకీయ పరిణామాల మద్య రెండు రోజుల పాటు బిల్లులు దోబూచులు ఆడాయి. ఎట్టకేలకు బుధవారం సాయంత్రం బిల్లులు రెండు సెలెక్ట్ కమిటికి పంపాలని చైర్మన్ షరీఫ్ తనకు ఉన్న అధికారాలతో నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఇదిలా ఉంటే మండలిలో తమ ఎమ్మెల్సీలకు జరిగిన అవమానం నేపధ్యంలో నేడు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నామని తెలుగుదేశం ప్రకటించింది. వైసీపీ మంత్రులు అడ్డుతగిలారనీ, సభా సంప్రదాయాల్ని పాటించకుండా, తమ ఎమ్మెల్సీలపై రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపిస్తుంది. అది పక్కన పెడితే బుధవారం మండలి వ్యవహారాలపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
అసెంబ్లీని ప్రోరోగ్ చేసి, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఆయన తాడేపల్లిలోని తన ఇంట్లో న్యాయ నిపుణులు, ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ బిల్లులు ఆర్డినెన్స్ తెచ్చినా సరే గవర్నర్ ఆమోదం తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది.