ప్ర‌జ‌ల‌కు పందేరాలేకాదు.. పార్టీనీ ప‌ట్టించుకోవాలి జ‌గ‌న్…!

-

నేత‌ల‌ను న‌మ్ముకుంటే.. ఏమొస్తుంది? ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకుంటే.. ఓట్లేస్తారు! అనే ఫార్ములాను వైసీపీ అధి నేత‌, సీఎం జ‌గ‌న్ బాగా న‌మ్ముకున్న‌ట్టున్నారు. కానీ, ఇది బెడిసి కొట్టే ప్ర‌మాదం ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని గ‌త అనుభ‌వాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. నిజానికి జ‌గ‌న్ గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో గెలిచిన గెలుపు ఒక గెలుపు అనుకుంటే పొర‌పాటే. దానికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి.. జ‌గ‌న్‌పై సానుభూతి. సుదీర్ఘ పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌లు జ‌గ‌న్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. రెండు.. టీడీపీ నేత‌ల‌పై అసంతృప్తి. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న అవినీతి, దోపిడీల‌ను బాబు అరిక‌ట్ట‌లేక పోవ‌డాన్ని ప్ర‌జ‌లు సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఈ నేప‌థ్యంలోనే భారీ మెజారిటీతో జ‌గ‌న్‌ను గెలుపు గుర్రం ఎక్కించారు ప్ర‌జ‌లు. దీంతో నాయ‌కుల క‌న్నా.. ప్ర‌జ‌లే నాణ్య‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. వారికే నేరుగా డ‌బ్బులు కుమ్మ‌రిస్తున్నారు. అమ్మ ఒడి కావొచ్చు.. మ‌రొక‌టి కావొచ్చు.. అయితే గ‌తంలోనూ చంద్ర‌బాబు ఇలాంటి కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశారు. ప‌సుపు-కుంకుమ పేరుతో కోట్ల‌కు కోట్లు కుమ్మ‌రించారు. ఏం సాధించారు.

క్షేత్ర‌స్థాయిలో పార్టీని, నేత‌ల‌ను ప‌రుగు పెట్టించ‌డంలో ఆయ‌న విఫ‌ల‌మ‌య్యారు. నేత‌ల్లో పేరుకున్న అసంతృప్తిని ప‌ట్టి పెక‌లించ‌డంలోనూ అలివిమాలిన నిర్ల‌క్ష్యం.. బాబుకు ప‌రాజ‌యం మూట‌గ‌ట్టింది. ఇప్పుడు ప‌రిస్థితి గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ కూడా క్షేత్ర‌స్థాయిలో నేత‌లను ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు నేరుగా నిధులు పంచేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, దిగువ శ్రేణి నాయ‌కుల‌తో ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్ష సంబంధాలు దాదాపుగా క‌ట్ అయ్యాయి. ఇది మున్ముందు .. ప్ర‌జ‌ల‌తో నాయ‌కులు మ‌మేకం అయ్యేందుకు అవ‌కాశం లేకుండా చేసింది.

అంటే.. జ‌గ‌న్ ను మాత్ర‌మే ప్ర‌జ‌లు నేత‌గా భావించే ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌తంలోనూ చంద్ర‌బాబును హీరో నే అనుకున్నారు.కానీ, త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిసిందే. ఇప్పుడు కూడా ఇదే త‌ర‌హా ప‌రిస్థితి వైసీపీలో నెల‌కొంది. దీనిని గుర్తించి నేత‌ల అసంతృప్తిని త‌గ్గించేందుకు, ప్ర‌జ‌ల‌తో వారికి ఉన్న సంబంధాలు పెంచేందుకు జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version