అమరావతి: కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల అమల్లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. తాజాగా విద్యాదీవెన పథకం నిధులు విడుదల చేయనున్నారు. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థుల కాలేజీ ఫీజులకు సంబంధించి రెండోసారి నిధులు విడుదల చేస్తున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి. మొత్తం 10 లక్షల 97వేల మంది విద్యార్థులకు లబ్ధి చేరకూరనుంది. ఇందుకోసం సీఎం జగన్ రూ. 693 కోట్ల 81 లక్షలను కేటాయించారు.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థుల కోర్సుల ఫీజులకు సంబంధించి నాలుగు విడతల్లో ఈ డబ్బులు జయ చేయనున్నారు. ఏప్రిల్ 19న తొలి విడత డబ్బులను విడుదల చేశారు. తాజాగా రెండో విడత సాయం డబ్బులను తల్లుల అకౌంట్లలోకి డిపాజిట్ చేయనున్నారు. డిసెంబర్‌లో మూడో విడత, ఫిబ్రవరిలో నాలుగో విడత నిధులు విడుదల చేయనున్నారు. విద్యారంగంపై 26 వేల 677 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.