ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఓటమి పాలైంది. ప్రతిపక్షం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దేశ చరిత్రలో ఏ పార్టీ చవి చూడని పరాజయాన్ని అందుకున్న వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
తాజాగా తాడేపల్లి లో ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులతో జగన్ సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఈ ఏడాది డిసెంబర్ లో ప్రజా ఓదార్పు యాత్ర చేయాలని ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ యాత్రలో ఎన్నికల్లో వైసీపీ ఓటమి బాధతో చనిపోయిన వారి కుటుంబాలను, అలాగే టీడీపీ, జనసేన నాయకుల దాడిలో గాయపడిన వారిని జగన్ పరామర్శించ్చేందుకు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. కాగా జగన్ సీఎం కాక ముందు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.