కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించని తెలుగు రాష్ట్రాలు

-

తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించాల్సి ఉన్నా ఇంతవరకూ ఆ పని చేయలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై సోమవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

‘2021 జులై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కేఆర్‌ఎంబీ జ్యూరిస్‌డిక్షన్‌ నోటిఫికేషన్‌ ప్రకారం అందులో పేర్కొన్న షెడ్యూల్‌-2లోని సాగునీటి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు తప్పనిసరిగా బోర్డుకు అప్పగించాలి. కానీ రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ, యాజమాన్య బాధ్యతలేమీ అప్పగించలేదు’ అని తెలిపారు.

కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా జల విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ కృష్ణా నీటిని ఉపయోగించుకుంటోందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘జల విద్యుదుత్పత్తికి తెలంగాణ కృష్ణా నీటిని వాడుకొంది. అయితే తమ ఉత్తర్వులను అనుసరించాలంటూ కేఆర్‌ఎంబీ తెలంగాణకు 2021 జూన్‌ 17, జులై 15, 16 తేదీల్లో లేఖలు రాసింది’ అని షెకావత్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version