స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే పై జానకిపురం సర్పంచి మరో సారి ఫైర్ అయ్యారు. ఈ సారి మాత్రం నిన్ను వదిలేది లేదని హెచ్చరించారు. గతంలో వివాదం జరిగిన తర్వాత ఎమ్మెల్యే రాజయ్య జానకిపురం గ్రామానికి రూ. 25 లక్షలు ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బులు కావాలంటే అప్పు తీసుకున్నట్లు సంతకం పెట్టాలని మధ్యవర్తి ద్వారా ఒత్తిడి చేయిస్తున్నాడని సర్పంచి నవ్య ఆరోపించారు.
ఏనాడు ఎమ్మెల్యే దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. తప్పు చేస్తే భయపడతా నేనేందుకు భయపడాలి. నా భర్తను నాకు కాకుండా దూరం చేస్తున్నారు. ఈ విషయంలో నా భర్తకు విడాకులైన ఇస్తా గానీ ఎంత పెద్ద మనిషి వచ్చినా లొంగే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. ఓ మధ్యవర్తి మహిళ సంతకం పెట్టాలని వేధిస్తోందని ఆరోపించారు. గ్రామానికి వచ్చే నిధుల గురించి నేనేందుకు ప్రత్యేకంగా సంతకం పెట్టాలి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జానకిపురం సర్పంచి నవ్య గతంలోనూ ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఏకంగా ఎమ్మెల్యే సర్పంచి ఇంటికి వచ్చి క్షమాపణలు కోరడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య తన పుట్టినరోజు కార్యక్రమంలో బావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. నలుగురు అక్కా చెల్లెళ్లు ఉన్న నేను మరో మహిళపై ఇలాంటి పనులు ఎందుకు చేస్తానని బహిరంగంగానే మాట్లాడారు.
అంత సద్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా వివాదం మళ్లీ మొదటికొచ్చింది. గ్రామ అభివృద్ధికి కావాల్సిన నిధులు కావాలంటే ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లు సర్పంచ్ నవ్య ఆరోపించారు. నా భర్త ను బ్లాక్ మెయిల్ చేసి నాతో సంతకం పెట్టించాలని ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపించారు. నా భర్తకు విడాకులైన ఇస్తాగానీ ఆత్మాభిమానం చంపుకోనని నవ్య అన్నారు. ఎవరూ ఒత్తిడి చేశారో వారందరీ పేర్లు త్వరలోనే బయటపెడతానని అన్నారు.