జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిదానంగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆవేశం మాట్లాడటం తప్ప..ఆలోచనతో పార్టీ బలాన్ని పెంచడం ఎలా..ఓటు బ్యాంకు పెంచడం ఎలా అనేది మాత్రం ఆలోచన చేయలేదు. ఎంతసేపు ఆవేశంగా జగన్ ప్రభుత్వాన్ని తిట్టడం చేశారు. దీని వల్ల జనసేన బలపడలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ వారాహి యాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రజా మద్ధతు పెంచుకునే దిశగా పవన్ ముందుకెళుతున్నారు.
ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకపోయినా ముందు జనసేన బలపడాలనే దిశగా రాజకీయం నడిపిస్తున్నారు. యథావిధిగా వైసీపీపై విరుచుకుపడుతూనే..వైసీపీ వ్యతిరేక ఓట్లని జనసేన వైపుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో తన సినీ ఇండస్ట్రీకు సంబంధించిన ఇతర హీరోల ఫ్యాన్స్ ఓట్లపై పవన్ గురి పెట్టారు. రాష్ట్రంలో పవన్ ఫ్యాన్స్ ఒక్కరే కాదు..ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వారికి లక్షల్లో అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ అభిమానుల ఓట్లు పొందేందుకు పవన్ ప్లాన్ చేశారు.
సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని..అభిమానం అనేది సినిమాల వరకు చూపించాలని, రాజకీయాల్లోకి వచ్చేసరికి అంతా రాష్ట్రం కోసం నిలబడాలని అంటున్నారు. ఈ క్రమంలో తనకు మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎన్టీఆర్, రవితేజ, చిరంజీవి, బాలకృష్ణ..ఇలా ప్రతి హీరో ఇష్టమే అని, వారితో కనిపించినప్పుడల్లా మాట్లాడతానని, అయితే వారి అభిమానులు సినిమాల టైమ్ లో అభిమానం చూపించి..రాజకీయాల్లో ఏకమై రాష్ట్రం కోసం నిలబడి..తనకు మద్ధతు ఇవ్వాలనే కోణంలో పవన్ చెబుతున్నారు.
అటు నోటాకు ఓటు వేసి వేస్ట్ చేసేవారు కూడా ఈ సారి జనసేనకు ఓటు వేయాలని కోరారు. ఇలా పవన్ తమ ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే వేరే హీరో ఫ్యాన్స్ పవన్ వైపు వస్తారా? అంటే చెప్పడం కష్టమే. ఎలాగో మెగా ఫ్యాన్స్ మద్ధతు ఉంటుంది. కానీ ఇతర హీరోల ఫ్యాన్స్ పార్టీల వారీగా విడిపోయి ఉన్నారు. వారిలో వారే వైసీపీ, టీడీపీ అన్నట్లు ఉన్నారు. కొందరు జనసేనకు మద్దతు ఇవ్వవచ్చు. కానీ పూర్తి స్థాయి మద్ధతు మాత్రం దక్కే ఛాన్స్ లేదు.