టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియో ఫోన్ కస్టమర్లకు త్వరలో అద్భుతమైన ఫీచర్‌ను అందివ్వనుంది. ఇకపై జియో ఫోన్‌లో యూజర్లు నగదు పంపుకోవచ్చు. అందుకు గాను కొత్తగా జియో పే అనే యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు. కాగా ఈ యాప్‌ను ఇప్పటికే జియో పలువురు ఎంపిక చేసిన జియో ఫోన్ యూజర్ల ద్వారా టెస్ట్ చేస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ ఫీచర్ జియో ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
జియో ఫోన్‌లో అందుబాటులోకి రానున్న జియో పే ఫీచర్ ద్వారా వినియోగదారులు నగదు పంపుకోవచ్చు. రిసీవ్ చేసుకోవచ్చు. యూపీఐ విధానంలో పేమెంట్లు జరుగుతాయి. ఇందుకు జియో సంస్థ ఎన్‌సీపీఐతో ఒప్పందం చేసుకుంది. అలాగే ఈ ఫీచర్‌ను అందించేందుకు జియో కంపెనీ యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్రా, ఆర్‌బీఎల్, స్టాండర్డ్ చార్టర్డ్, ఎస్‌బీఐ, ఎస్ బ్యాంకులతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిసింది.
ఇక ముందుగా జియో ఫోన్‌లో జియో పే సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిసింది. తరువాత జనవరి వరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా మై జియో యాప్ ద్వారా జియో పే సేవలు అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఇప్పటికే ఉన్న గూగుల్ పే, ఫోన్‌పే వంటి పేమెంట్స్ యాప్స్‌కు పోటీగా జియో సంస్థ జియో పే సేవలను అందిస్తుందని తెలిసింది.