కరోనా లాక్‌డౌన్ కారణంగా చాలా మంది జూమ్ అనే వీడియోకాన్ఫరెన్స్ యాప్‌ను వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఆ యాప్‌కు పోటీగా ‘జియో మీట్’ (JioMeet) పేరిట ఓ నూతన వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ యాప్‌కు చెందిన వివరాలను జియో వెల్లడించింది.
జియో మీట్ వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ను వాడుకోవాలంటే యూజర్లు ముందుగా తమ మొబైల్ లేదా ఈ-మెయిల్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గెస్ట్‌గా కూడా ఈ యాప్‌ను వాడుకోవచ్చు. ఇక యాప్‌లో ఉచిత ప్లాన్, బిజినెస్ ప్లాన్లను అందివ్వనున్నారు. ఉచిత ప్లాన్‌లో ఒకేసారి 5 మంది వ్యక్తులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. బిజినెస్ ప్లాన్ అయితే ఒకేసారి 100 మంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.
జియో మీట్ యాప్ లో ఆడియో, వీడియో కాల్ నాణ్యత ఇంటర్నెట్ స్పీడ్‌ను బట్టి ఉంటుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ అయితే వీడియో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించే హోస్ట్ పార్టిసిపెంట్లను ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ చేయవచ్చు. అలాగే వారి ఆడియో, వీడియో ఫీడ్లను వారు కంట్రోల్ చేయవచ్చు. అంతకు ముందు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ల హిస్టరీ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఇక అప్పటికే కాన్ఫరెన్స్ కొనసాగుతున్నా సరే.. అందులో ఇన్విటేషన్ అందుకున్న వారు నేరుగా పార్టిసిపేట్ చేయవచ్చు.
జియో మీట్ కార్పొరేట్ యూజర్లు యాప్‌లో రిజిస్టర్ చేసుకోకుండానే నేరుగా క్రోమ్ బ్రౌజర్ లింక్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. ఇక ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్, విండోస్, మాక్ స్టోర్‌లలో యూజర్లకు లభ్యం కానుంది. అయితే ఈ యాప్‌ను ఎప్పుడు విడుదల చేసేది.. జియో వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే ఈ యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.