చెన్నైలో తొలి టెస్టులో భారత్ ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లు ఇంగ్లండ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసినప్పటికీ మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారీగా పరుగులు చేయడంలో ఇండియాకు దెబ్బ పడింది. దీనికి తోడు పిచ్ సహకరించకపోవడం కూడా ఇండియా ఓటమికి కారణం అయింది. అయితే మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినప్పటికీ ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం చెన్నై పిచ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
తాను ఇప్పటి వరకు చెన్నై టెస్టులో ఆడిన లాంటి చెత్త పిచ్‌ను ఎప్పుడూ చూడలేదని ఆర్చర్ అన్నాడు. చెన్నై పిచ్ లో మొదటి రెండు రోజులు బాగానే ఉన్నప్పటికీ తరువాత నుంచి అసాధారణ రీతిలో బౌన్స్ వచ్చిందన్నాడు. అయితే తాము విజయం కోసం ప్రయత్నం చేశాం కానీ ఇంత సులభంగా గెలుస్తామని అనుకోలేదని, ఇండియాను ఇండియాలో ఓడించడం సవాల్ అవుతుందని భావించామని, కానీ పిచ్ వల్లే తాము గెలవగలిగామన్నాడు. పిచ్ ఇలా ప్రవర్తిస్తుందని తాము అస్సలు ఊహించలేదన్నాడు. పిచ్ సహకారం వల్లే గెలిచామని స్పష్టం చేశాడు.
అయితే చెన్నై టెస్టు అనంతరం బీసీసీఐతోపాటు పిచ్ క్యురేటర్, కెప్టెన్ కోహ్లిపై కూడా విమర్శలు వచ్చాయి. కానీ చాలా మంది మాత్రం పిచ్ క్యురేటర్‌నే విమర్శించారు. అత్యంత చెత్త పిచ్‌ను తయారు చేశారంటూ కామెంట్లు చేశారు. ఇక పిచ్ క్యురేటర్ వి.రమేష్ కుమార్ మాత్రం ఆ పిచ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు ఇద్దరికీ అనుకూలిస్తుందని చెప్పాడు. కానీ కేవలం ఇంగ్లండ్ బౌలర్లు, బ్యాట్స్‌మన్లకు మాత్రమే మొదటి 3 రోజులు ఎందుకు సహకరించింది అన్న విషయంలో స్పష్టత లేదు. ఇక ఇరు జట్ల మధ్య మళ్లీ చెన్నైలోనే రెండో టెస్టు మ్యాచ్ శనివారం ప్రారంభం కానుంది.