బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు మహబూబ్ నగర్ లో పర్యటించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేస్తున్న రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లో బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలకు నడ్డా పలు సూచనలు చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై ప్రజలకు తెలియజేయాలని.. టీఆర్ఎస్ అవినీతిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. తెలంగాణలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్న నడ్డా.. ప్రణాళిక బద్దంగా పని చేసి, బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయాలని సూచించారు.
దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన మహేశ్వరంలో బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర ముగింపు సభ ఉంటుంది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానుండటంతో భారీగా జన సమీకరణ చేయాలని, పార్టీ పటిష్టత కోసం అందరూ కష్టపడాలని నేతలకు జేపీ నడ్డా సూచించారు. బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర నేతలకు చెప్పారు. ‘కూర్చీ పోతుందని చూడకండి.. మీ విషయం పార్టీ చూసుకుంటుంది’ అంటూ భరోసా ఇచ్చారు.